
మూడు రోజుల క్రితం 2022కు గుడ్ బై చెప్పిన టీమిండియా.. కొత్త ఏడాదిని విజయంతో బోణీ కొట్టాలని భావిస్తున్నది. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ ఓడినా టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన మెన్ ఇన్ బ్లూ.. కొత్త ఏడాదిలో శ్రీలంకతో తొలి పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ మేరకు ముంబైలోని వాంఖెడే వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు రానుంది. శ్రీలంక తొలుత బౌలింగ్ చేయనుంది. భారత జట్టు తరఫున శుభమన్ గిల్, శివమ్ మావి అరంగేట్రం చేయనున్నారు. అర్ష్‌దీప్ సింగ్ ఆడటం లేదు.
టార్గెట్ – 2024 లక్ష్యంగా యువ జట్టును ప్రకటించిన టీమిండియా లంకను ధీటుగా ఎదుర్కునేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంది. భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు సీనియర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ లేకుండానే బరిలోకి దిగుతున్న భారత జట్టు యువరక్తంతో నిండి ఉంది.
టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించిన (టీ20లకు) హార్ధిక్ పాండ్యా.. ఈ సిరీస్ కూ సారథిగా ఉన్నాడు. అయితే తుది జట్టులో అర్ష్‌దీప్ సింగ్ కు చోటు దక్కలేదు.
భారత్ తో పాటు శ్రీలంక కూడా బలంగానే ఉంది. కొద్దికాలంగా ఆ జట్టు నిలకడగా రాణిస్తున్నది. ఆసియా కప్ లో విజయం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. బ్యాటింగ్ లో నిస్సంక, మెండిస్, భానుక రాజపక్స, దసున్ శనక కీలక ఆటగాళ్లు. బౌలర్లలో హసరంగ ప్రమాదకర స్పిన్నర్, బ్యాటింగ్ తో పాటు స్పిన్ కు కూడా అనుకూలించే వాంఖెడే పిచ్ పై రెండో సారి బ్యాటింగ్ చేసినవాళ్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ మ్యాచ్ లో టీమిండియా విక్టరీ కొడుతుందో లేదో తెలియాలంటే కొద్దిసేపు వేచి ఉండాల్సిందే.
తుది జట్లు :
టీమిండియా: ఇషాన్ కిషన్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్, హర్షల్ పటేల్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి
శ్రీలంక : పతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, భానుక రాజపక్స, ధనంజయ డిసిల్వ, చరిత్ అసలంక, దసున్ శనక (కెప్టెన్), వనిందు హసరంగ, చమీక కరుణరత్నె, కసున్ రజిత, దిల్షాన్ మధుషనక